ఈ యేడాది కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పక్షాన అధికారికంగా జరుపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. విమోచన దినోత్స వాన్ని జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని అమిత్ షా దెప్పిపొడిచారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోర్టాలో గోర్టా అమరవీరుల స్మారక చిహ్నం, దేశ మొదటి హోం మంత్రి దివంగత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన కామెంట్స్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

 

సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా (Amit shah) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవం అని ఎందుకు పిలవకూడదని అడిగే వాళ్లు… దేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఆగస్ట్ 15 తేదీని ఎందుకు మనం లిబరేషన్ డే గా జరుపోకూకడదు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అది బ్రిటీష్ వాళ్లు అయినా, నిజాం అయినా.. అణచివేతదారులకు వ్యతిరేకంగా త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమన్నారు. ఇంకా ఇక్కడే ఉండిపోకండి… భవిష్యత్ నిర్మాణానికి ముందుకు రండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ విముక్తి కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని అమిత్ షా గుర్తు చేశారు. సర్దార్ పటేల్ చొరవ తీసుకుని ఉండకపోతే హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. బీదర్‌‌కు కూడా స్వాతంత్ర్యం వచ్చి ఉండేది కాదని వెల్లడించారు. గరోటా గ్రామస్తుల త్యాగాలను ఆయన ప్రశసించారు.

 

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు గరోటా గ్రామస్థులను నిజాం సైనికులు హత్య చేశారన్నారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని హత్య చేశారన్నారు. ఇప్పుడు అదే గడ్డపై మనం 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని వెల్లడించారు. అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామని చెప్పారు.