పాన్‌ ఇండియాలో తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నట్టే తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు దగ్గర్లోనే ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 ఏప్రిల్‌ 27న పుట్టిన టీఆర్‌ఎస్‌.. అదే ఏడాది మే 17న కరీంనగర్‌ గడ్డపై సింహగర్జన నిర్వహించిందని, కరీంనగర్‌ ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. కరీంనగర్‌లో జరిగిన కళోత్సవాల ముగింపు సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇదే కరీంనగర్‌లో కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయం రేపటి సంచలనం కాబోతున్నదని చెప్పారు. కేసీఆర్‌ నిర్ణయానికి ప్రజలందరి మద్దతు, ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ మాట ఎంత పవర్‌ఫుల్‌గా పేలిందో కళాకారుల ఆటా, పాట కూడా అంతే పవర్‌ఫుల్‌గా పేలాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ మాట ఎంత పవర్‌ఫుల్‌గా పేలిందో కళాకారుల ఆటా, పాట కూడా అంతే పవర్‌ఫుల్‌గా పేలాయని అన్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన ఎర్రజెండా పాటను ప్రస్తావించిన కేటీఆర్‌.. ఎరుపు, తెలుపు కలిస్తేనే గులాబీ జెండా అయ్యిందని, నాడు ఎరుపు రంగు కోరుకున్న పనులన్నీ ఇపుడు కేసీఆర్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఎర్రజెండా ఎత్తుకున్న వాళ్లంతా ఇప్పుడు కేసీఆర్‌ వెంట నడుస్తున్నారని చెప్పారు.

 

ఒకప్పుడు సినిమా ఫీల్డ్‌లో ఎందరో అజ్ఞాత సూర్యులు ఉండేవారని, తమది తెలంగాణ అని చెప్పుకోలేక పోయేవారని, ఇప్పుడు తెలంగాణ నేపథ్యం ఉంటేనే సినిమా హిట్టవుతున్నదని అన్నారు. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో 574 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా అనేకమంది కళాకారులు ఉన్నారని, వారికీ అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ వైభవాన్ని చాటేలా హైదరాబాద్‌లో కళోత్సవాలు నిర్వహించుకుందామన్నారు.