ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కులవృత్తులు ధ్వంసమైతే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి కులవృత్తికి న్యాయంచేసే దిశగా సంక్షేమ కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఆదివారం జరిగిన గౌడ ఆత్మీయసమ్మేళనానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 2,29,852 మంది గీతకార్మికులు ఉండగా.. టీఎస్‌టీలో 4,181 మంది, టీఎఫ్‌టీల్లో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. యాభై ఏండ్లు పైబడిన 70వేల మంది గీత కార్మికులకు నెలనెలా 2వేల పింఛన్‌ అందిస్తున్నామని, దేశంలో మరెక్కడా ఈ తరహా సాయం అందడం లేదని కేటీఆర్‌ వివరించారు. గీత కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని.. పది రోజుల్లోనే సాయమందేలా నిబంధనలను మరింత సులభతరం చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,092 మంది గీతవృత్తి దారుల కుటుంబాలకు దాదాపు రూ.30 లక్షలను నష్టపరిహారంగా అందజేసినట్టు వివరించారు.

 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఓబీసీ మంత్రిత్వశాఖను ఎందుకు ఏర్పాటుచేయడంలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంలో ఇప్పటివరకు బలహీనవర్గాలకు మంత్రిత్వశాఖనే లేదని, బీజేపీలో ఓబీసీ మోర్చా ఉన్నదని గుర్తు చేశారు. పార్టీలో ఓబీసీ విభాగం ఉన్నప్పుడు.. మరి ప్రభుత్వంలో ఎందుకు ఓబీసీశాఖ ఉండదు? అని కేటీఆర్‌ నిలదీశారు. మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయలేని బీజేపీ.. బలహీన వర్గాల సంక్షేమాన్ని ఏం పట్టించుకుంటుందని విమర్శించారు. బలహీన వర్గాలపై బీజేపీకి ఉన్నది కపట ప్రేమనా, వారు కార్చేది మొసలి కన్నీళ్లా అనేది ప్రజలే ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు.