కార్తిక మాసం పురస్కరించుకుని కోటి దీపోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు హైదరాబాద్లోని ఎన్టీయార్ స్టేడియంలో జరపనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దేదీప్యమానంగా నిర్వహించే ఈ మహా పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తల విచ్చేయనున్నారు. రోజూ ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ దీపోత్సవంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లోని దేవతామూర్తులను దర్శించుకుంటే కలిగే పుణ్యం, ఆనందాన్ని ఒకేచోట, ఒకే వేదికపై కల్పించనున్నట్టు తెలిపారు. కోటి దీపోత్సవానికి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ప్రజల గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒకే వేదికపైకి తెచ్చిన కోటి దీపోత్సవ వేడుక దిగ్విజయంగా పదేళ్లు పూర్తి చేసుకుని 11వ ఏట అడుగుపెట్టబోతుందని చెప్పారు.