కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ  ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని, తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్‌లో తన పేరు లేదని, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని సురేఖ చెప్పారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్‌లో తనకంటే జూనియర్లను నామినేట్ చేశారని ఆమె ఆరోపించారు. తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడం బాధ కలిగించిందన్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనను నియమించడం అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని లేఖలో రాశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ లోనే సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకి పార్టీలో సముచితస్థానాన్ని కల్పించలేదనే కారణంగా టిపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం.