కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే పోరాటం మునుగోడు బైపోల్స్ అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇతర నేతలతో కలిసి కోమటిరెడ్డి నేడు చౌటుప్పల్ లో ప్రచారం చేశారు. తాను భయపడి ఇంట్లోనే కూర్చుండిపోలేదని, మునుగోడు అంటే ప్రపంచమే చర్చించుకునేలా చేశానని చెప్పుకొచ్చారు. ఆనాడు కేసీఆర్ తో తెలంగాణ పోరాటం చేసిన నేతలు ఇప్పుడు ఆయన పక్కన లేరని, ద్రోహులంతా జమయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. ద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని రాజేందర్ ను అవమానించి బయటికి పంపించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా కొట్లాడని విధంగా అసెంబ్లీలో మూడున్నరేండ్లు గా కొట్లాడానన్న రాజగోపాల్ రెడ్డి.. అయినా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కనికరించలేదని ఆరోపించారు.
ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని, గ్రామాలలో బెల్టు షాపులు పెట్టించి 30ఏండ్లకే యువత మరణానికి కేసీఆర్ కారణమవుతున్నడని మండిపడ్డారు. కులాలవారీగా కాకుండా ప్రతి పేదోడికి పేద బంధు పథకం ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.