కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, అంతేకాకుండా టీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం నాయకులవే కాకుండా… అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక.. మజ్లిస్ పార్టీని బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం జాతీయ పార్టీ పెట్టినట్లు, కేసీఆర్ పీఎం, ఆయన కూతురు కేంద్ర మంత్రి అయినట్టు కల్వకుంట్ల కుటుంబం పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నారు.. ఏం ఉద్దరించడానికి ప్రకటిస్తున్నారో, దాని సారాంశమేంటో అర్థం కాక టీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే.. ప్రజల దృష్టిని మరల్చేందుకే జాతీయ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తన జాతీయ పార్టీపై తప్ప తన అవినీతి, కుటుంబం పై చర్చ ఉండకూడదనే కల్వకుంట్ల కుటుంబం ఓ కొత్త నాటకానికి తెర తీసిందని ఆరోపించారు. కేసీఆర్ కాళ్ల కింద భూమి కదిలి పోతుందని.. అందుకే ఇతర రాష్ట్రాల పేరుతో ప్రజలను మభ్య పెడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.