మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని మనం డిమాండ్ చేద్దాం అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కే నోబెల్ బహుమతి ఇవ్వాలని, కరోనా టీకా విషయంలో మోదీ చేసికృషి, తీసుకున్న చొరవ.. భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికి బాగా తెలుసని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ వివిధ రంగాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నందుకు గానూ.. నోబెల్ బహుమతులు ఇవ్వాల్సిందేనన్నారు. కరోనా చికిత్స కు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్నందుకు.. వైద్య రంగంలో కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు. అబద్ధాలు, అవినీతి ఇలా వివిధ రంగాలకు గానూ.. నోబెల్ బహుమతి తీసుకునే అర్హత కేసీఆర్‌కే ఉందని కిషన్‌రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మోదీ జీకి మెడిసిన్‌ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. మోదీ కేబినెట్ మిత్రులందరూ చాలా తెలివిమంతులు.. ఇది అంగీకరించాల్సిన విషయమన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి తెలివిమంతుడు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో మోదీనే కనుగొన్నాడని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియోను కేటీఆర్ ట్వీట్ చేశారు.