తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించామని గుర్తు చేశారు. అయితే.. సికింద్రాబద్- విశాఖ మధ్య ప్రారంభమయ్యే రైలు ఆరోవది అని తెలిపారు. శనివారం ప్రధాని మోదీ ఈ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రోటోకాలం ప్రకారం సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించామని ప్రకటించారు.

శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై.. విశాఖకు ట్రైన్ చేరుకుంటుందని కిషన్ రెడ్డ తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్ కి హాల్టింగ్ సౌకర్యం కల్పించామన్నారు. అయితే.. శనివారం మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందన్నారు. అందరికీ పరిచయం కావాలనే ఇలా చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండగ రోజు తెలుగు రాష్ట్రాలకు పండగ కానుకగా వందేభారత్ ట్రైన్ ప్రారంభిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.