కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత, నేపథ్యసంగీతం పనుల్లో సంగీత దర్శకుడు రవిబసుర్ బిజీగా వున్నారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది. శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది.కేజీఎఫ్-2 తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి, కెమెరా: కృష్ణమురళి.