కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5.20కోట్లు చెల్లించాలని నిషేధిత పీఎఫ్‌ఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆస్తులకు నష్టం జరుగడంతో పరిహారం ఇవ్వాలని కోరుతూ కేఎస్ ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఇటీవల ఈడీ, ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టడంతో పాటు అనేక మంది నాయకులను సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టులను నిరసిస్తూ ఈ నెల 23న పీఎఫ్‌ఐ మద్దతుదారులు బంద్‌కు పిలుపునివ్వగా, బంద్‌లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. హింసాకాండలో కార్పొరేషన్ బస్సులు దెబ్బతినగా పీఎఫ్‌ఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారని, బస్సులను, ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారని, ప్రజలపై కూడా దాడి చేశారని ఆర్టీసీ ఆరోపించింది.
ఆర్టీసీ తరఫున న్యాయవాది దీపు టంకన్ కోర్టులో వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసు లేకుండా నిరసనకు పిలుపునిచ్చారు, ఇది హైకోర్టును ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కార్పొరేషన్‌పై పెద్ద ఎత్తున జనం ఆధారపడ్డారని, అకస్మాత్తుగా నిరసనకు పిలుపునివ్వడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయలేమని పిటిషన్‌లో ఆర్టీసీ తెలిపింది. బంద్ రోజున 2,439 బస్సులు, 9,770 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారన్న ఆర్టీసీ.. ఇందులో 58 బస్‌లు ధ్వంసమయ్యాయని, 10 మంది ఉద్యోగులు, ఒక ప్రయాణికుడు గాయపడ్డారని కేఎస్‌ఆర్టీసీ తెలిపింది.