తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో చరిత్రలో నిలిచిపోతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. తెలం తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తోందని.. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ కదం తొక్కారన్నారు. దీనికి తమ సంపూర్ణ మద్దతు వుంటుందని, కేరళ ప్రజల మద్దతు కూడా వుంటుందని ప్రకటించారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సీఎం పినరయ్ విజయన్ హాజరయ్యారు. దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయమని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. అన్ని వ్యవస్థల్లోకి బీజేపీ చొచ్చుకొచ్చిందని, అన్నింటినీ కబళించాలని చూస్తోందని దుయ్యబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారని, గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పినరయ్ విజయన్ ఆరోపించారు.