BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 24 న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం ప్రకటించడంతో కవితకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామని అన్నారని, కానీ… అలా చేయలేదని కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన మొబైల్ ను సీజ్ చేశారని పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ… ఈడీ విచారణ నిమిత్తం తనను కార్యాలయానికి పిలవడంపై పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత గురువారం నాడు మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 11 న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను 9 గంటల పాటు విచారించారు. 16 న మళ్లీ విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

 

అయితే… బుధవారం భారత్ జాగృతి ఆధ్వర్యంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్​ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ కి వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఢిల్లీలోని లే మెరేడియన్​హోటల్​లో మధ్యాహ్నం నుంచి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.