హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మైండ్‌స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో నిర్మాణ పనులకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నానని ఆదివారం ట్వీట్ చేశారు.
మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో 31 కి.మీ. పొడవున రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వరంలో చేపట్టే ఈ ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తికాబోతోంది. ఇది కాకుండా బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మధ్య మరో 31 కి.మీ మేర మెట్రో విస్తరణ కోసం డీపీఆర్‌ను పంపి కేంద్రతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
మెట్రో రెండో దశలో మైండ్‌స్పేస్-శంషాబాద్ మార్గంతోపాటు బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మార్గాలను కూడా నిర్మించాలన్న ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీహెచ్ఈఎల్-లక్డీకాపూర్ మధ్య 26 కి.మీ. మార్గంలో 23 స్టేషన్లు, నాగోల్-ఎల్బీనగర్ మధ్య 5 కి. మీ. మార్గంలో 4 స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పనుల కోసం వచ్చే కేంద్ర బడ్జెట్లో రూ.8,453 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ గత నవంబర్లోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌కు లేఖ రాశారు.







