ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కనిపించింది. దీంతో ఒక్కసారిగా సంచలన రేగుతోంది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ముత్తా గౌతమ్, అరణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ పేర్లు కూడా వున్నాయి. సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా వున్నట్లు ఈడీ పేర్కొంది. ఒబెరాయ్ హోటల్ లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తమ విచారణ సందర్భంగా సమీర్ మహేంద్ర చెప్పాడని ఈడీ తెలిపింది.
చార్జిషీట్ లోని 95, 96, 125వ పేజీల్లో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీ ఇండోస్పిరిట్ లో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగం నమోదు చేసింది. మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా ఈ కంపెనీలో వాటా ఉందని పేర్కొంది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఫోన్లను ధ్వంసం చేసిన అంశాన్ని కూడా చార్జిషీట్ లో పెట్టారు.