కర్నాటక మంత్రి ఉమేశ్ విశ్వనాథ్ కత్తి(61) హఠాత్తుగా మరణించారు. అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ను బెంగళూరులోని రామయ్య ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంత్రి స్ప్రుహ లేకపోవడం, శ్వాస తీసుకోకపోవడంతో అత్యవసర చికిత్స అందించారు. అయినా.. మంత్రి స్పందిచకపోవడంతో ఉమేశ్ చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. 61 ఏళ్ల వయసున్న ఉమేష్ విశ్వానాథ్ సీఎం బసవరాజు బొమ్మై కేబినెట్ లో అటవీ, ఆహారం, పౌర సరఫరాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1985లో రాజకీయాల్లోకి వచ్చిన ఉమేష్ విశ్వానాథ్ 8 సార్లు హక్కేరి నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు.
ఇక మంత్రి ఉమేశ్ మరణంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన అనుభవజ్ఞుడైన నాయకుడు ఉమేష్ కత్తి మరణం తనని బాధించిందని మోడీ ట్వీట్ చేశారు. ఇక… కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంత్రి మృతి పట్ల బసవరాజు బొమ్మై ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. ఉమేష్ రాష్ట్రానికి ఎంతో చేశారని కొనియాడారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని బొమ్మై తెలిపారు.