సీఎం బొమ్మై సారథ్యంలోని కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు భారీగా రావడంతో 3 రోజుల్లో సర్వీసులు నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఓలా కార్యకలాపాలను నిర్వహించే ఏఎన్‌ఐ టెక్నాలజీస్, ఉబర్, ర్యాపిడో సంస్థలకు నోటీసులు జారీచేసింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరాలు సమర్పించాలని కోరింది. లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
నిబంధనల ప్రకారం కార్లను మాత్రమే ట్యాక్సీలుగా నడపాలి. ఆటోల ద్వారా సేవలందించడం నిబంధనలకు విరుద్ధం. పైగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే ఆయా సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని రవాణా శాఖ పేర్కొంది. కర్ణాటకలో కనీస ఆటో చార్జ్ మొదటి 2 కిలోమీటర్లకు 30, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు 15 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటూ క్యాబ్లలో ఎక్కువ ఛార్జీలు వసూల్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.