మాజీ మంత్రి, బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశమైన తర్వాత ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు కన్నా రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో తనకు గౌరవం లేదని మండిపడ్డారు. రాష్ట్ర నాయకత్వం తనకు ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఇమడలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
2014 లో మోదీ నాయకత్వంపై ఆకర్షితుడినై, బీజేపీలోకి వచ్చానని, కానీ… ప్రస్తుత అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో మార్పులు వచ్చాయని విమర్శించారు. సోము వీర్రాజు పార్టీని తన సొంత సంస్థలా నడుకుపుకుంటున్నారని విరుచుకుపడ్డారు. పార్టీలో ఏమాత్రం చర్చించకుండా ఎంపీ జీవీఎల్ నరసింహారావు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమన్వయం చేసుకోవడంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.