మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నాకి కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు తాళ్ల వెంకటేశ్ యాదవ్మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఎమ్ నిజాముద్దీన్ తదితరులు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని, రాక్షస క్రీడను రాష్ట్రం నుంచి పారదోలాలని, రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసిరావాలని కన్నా పిలుపిచ్చారు. కేంద్రంలో మోదీ పాలన అద్భుతంగానే వుందన్నారు.
తాను టీడీపీలో ఎందుకు చేరుతున్నాననో అని బాగా చర్చ జరుగుతోందని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, దానిని పారదోలేందుకే టీడీపీలో చేరానని కన్నా వివరణ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి వైఎస్‌ను మరిపిస్తానంటే ప్రజలు నమ్మి.. జగన్ కు ఓట్లు వేసి అధికారం ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ప్రజల సంక్షేమం గురించి అసలు ఆలోచన చేయడం లేదని, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లిన చందంగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో సీఎం పదవిని జగన్ స్వీకరించిన మొదట్లోనే చెప్పానని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్.. అమరావతి (Amaravathi) రాజధానికి మద్దతు తెలిపి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్నినాశనం చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో ప్రజలకు భవిష్యత్ లేకుండా పోతోందని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు.












