బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేచ్ఛ ఉందన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు జూపల్లి. మీ బండారం బయట పెడతానని, తనకు భయపడి సస్పెండ్ చేశారన్నారు . గత రెండు, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వం చేసే పుస్తకం కూడా ఇవ్వలేదన్న జూపల్లి.. తనకు బీఆర్ఎస్ లోనే ఉన్నానా లేదా అనే అనుమానం ఉండేదన్నారు.
తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశానని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిలో తాను ఒకరినని తెలిపారు.. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తన ఇష్టం అన్నట్లుగా పాలన చేస్తున్నారని జూపల్లి విమర్శించారు. ఇక తన ఓటమికి ప్రభుత్వ పెద్దలే కారణమని జూపల్లి ఆరోపించారు. గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి తన చేతిలో ఓడిపోయారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ లో కీలక పరిణామం జరిగింది. కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తి వినిపిస్తున్న ఇద్దరు కీలక నేతలను పార్టీ సస్పెండ్ చేసింది. ఒకరు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరొకరు. ఇద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారు.
ఏప్రిల్ 9వ తేదీన కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారపట్టారు. ఉద్యమం కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతారా..? ప్రజాప్రతినిధులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వరా..? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామా..? అంటూ కేసీఆర్ ను తూర్పూరాపట్టారు. అయితే… ఇప్పుడు ఇద్దరూ ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తిగా మారింది.