తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గనక జాతీయ పార్టీ పెడితే… తమ సంపూర్ణ మద్దతు వుంటుందని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమార స్వామి ప్రకటించారు. వర్తమాన రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శూన్యత వుందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ లాంటి నాయకుడు అత్యవసరమని పేర్కొన్నారు. దేశ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ కు తమ మద్దతు వుంటుందని ప్రకటించారు. కుమార స్వామి ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలూ చర్చించుకున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, గుణాత్మక మార్పు కోసం స్థాపించే పార్టీకి తమ మద్దతు వుంటుందన్నారు. తెలంగాణ పాలన, పథకాలపై కర్నాటక సహా అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయని, తెలంగాణ మోడల్ దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టకపోతే… దేవంలో రాజకీయ, పాలన సంక్షోభం తప్పదని కుమార స్వామి హెచ్చరించారు. అన్ని వర్గాలనూ కలుపుకుపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.