సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమైక్యతా ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక… హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో జాతీయ జెండా పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.

 

ఇతర చోట్ల కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన జాతీయ సమైక్యతా సభలో హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాలతో హైదరాబాద్ కు స్వాతంత్ర్యం వచ్చిందని మహమూద్ అలీ అన్నారు. భారత్ లో హైదరాబాద్ విలీనం కావాలని నెహ్రూకు నిజాం లేఖ రాశారని చెప్పారు.

 

ఇక… ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ చేతిలో జాతీయ జెండా పట్టుకొని ర్యాలీ చేశారు. నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో జాతీయ జెండా పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.