జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జగన్ సర్కారు కాలయాపన చేస్తోందన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ తీవ్ర కాలయాపన చేస్తోందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రం దీన్ని సత్వరమే పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో నిధుల కొరత పేరుతో ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందన్నారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతానికి పైగా పూర్తయితే… గత నాలుగేళ్లలో 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. విశాఖ పారిశ్రామిక జోన్ కి అవసరమైన నీటిని, విశాఖ నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయన్నారు. ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లకపోవంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని పవన్ అన్నారు.

పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతో పాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని ఆయన సూచించారు.













