ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ సమస్య లేవనెత్తిన పాకిస్తాన్ కి భారత్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాది ఉసామా బిన్ లాడెన్ కు పాక్ ఆశ్రయం ఇచ్చిందని, అలాంటి దేశం మాట్లాడటమా? అంటూ ఏకిపారేశారు. అలాగే… భారత పార్లమెంట్ పై దాడికి దిగిన ఇస్లామిక్ ఉగ్రవాదులకు కూడా దాయాది పాక్ ఆశ్రయం ఇచ్చిందని, ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారు బోధలు ఎలా చేప్తారంటూ సూటిగా ప్రశ్నించారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా తీరుపై కూడా నిప్పులుగక్కారు. భారత ప్రయత్నాలకు చైనా ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ… పాక్ ను వెనకేసుకొస్తోందని దుయ్యబట్టారు.
భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి, ఇస్లామిక్ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను కాపాడుతూ వస్తోందని మండిపడ్డారు. ఐరాస భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ- సంస్కరణపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే వున్న జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తున్నాయని, ఉగ్రవాదులను అండగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. కరోనా మహమ్మారి ముప్పు, పర్యావరణ మార్పు, ఉగ్రవాదం లాంటి క్లిష్టమైన సవాళ్లపై సమర్థవంతంగా స్పందిస్తూ వుంటేనే ఐరాస విశ్వసనీయత పెరుగుతుందని జైశంకర్ స్పష్టం చేశారు.












