ఏపీలో నేటి నుంచే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ప్రారంభం

‘జగనన్నే మా భవిష్యత్తు’ అన్న కార్యక్రమానికి నేటి నుంచే వైసీపీ శ్రీకారం చుట్టనుంది. దీని ద్వారా దాదాపు 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ఛాన్స్ వుంటుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు. సీఎం జగన్ పలు వేదికల మీదుగా చెప్పినట్లుగానే గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరితే మరోమారు తమను ఆశీర్వదించాలని ఆయా కుటుంబాలను సీఎం జగన్ కోరనున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజా సర్వే ఫలితాలను కూడా వెల్లడిస్తామని పేర్కొన్నారు.

 

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ సైనికులుగా పార్టీ పదాతిదళం ప్రతి ఇంటికీ వెళ్లనుంది. దాదాపు 7 లక్షల మంది సారథులు, సచివాలయ కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లోనే సందర్శించనున్నారు. 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోనున్నారు. మమ్మల్ని జగన్ పంపారు. మీతో మాట్లడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం అని చెప్పనున్నారు.

 

అయితే.. పదాతిదళం కలుసుకునే వారిలో అన్ని కులాలు, మతాలతో పాటు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబాలు కూడా వుంటాయని సజ్జల స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారా ఏం అందాయి? గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి గమనించిన తేడా? అన్న ప్రశ్నలు కూడా వేయనున్నారు. ఇలా మొత్తం 5 ప్రశ్నలుంటాయి. ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసి, రసీదు కూడా అందిస్తారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960-82960 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వమని కోరుతారు. ఆ తర్వాత నిమిషంలోపే సంబంధిత కుటుంబానికి వీఆర్ఎస్ కాల్ ద్వారా సీఎం జగన్ ధన్యవాదాలు కూడా ప్రకటిస్తారు.

Related Posts

Latest News Updates