రెండో రోజూ బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు… అమెరికా ఏమందంటే…

ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగ‌ళ‌వారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వ‌రుస‌గా రెండో రోజూ కూడా త‌నిఖీలు చేప‌డుతున్నారు. అయితే, తాజాగా ఈ వివాదంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్‌ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేమని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల వల్లే అమెరికా, భారత్‌ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం బలోపేతమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

రెండో రోజు కూడా ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో, దస్త్రాల్లో వున్న ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని తీసుకుంటున్నారు. అయితే… ప్రసార విభాగం తప్ప, మిగిలిన ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సంస్థ మెయిల్ చేసింది. ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని కూడా సూచించింది. జీతాల గురించి ఏమడిగినా చెప్పాలని, వ్యక్తిగత ఆదాయాల గురించి మాత్రం చెప్పొద్దని షరతులు పెట్టింది. అలాగే ఈ సర్వే గురించి సోషల్ మీడియాలో కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది.

 

అయితే.. ఐటీ దాడులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో మూల స్తంభమని అన్నారు. మీడియా గొంతును అణిచివేయడమంటే ప్రజావాణిని అణిచివేయడమేనని అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ఒక ట్వీట్‌ చేశారు. ”ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమనేది ప్రజావాణిని అణిచివేయడంతో సమానం. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ వ్యక్తులు (బీజేపీ) సీబీఐ, ఈడీ, ఐ-టీ శాఖలను వారిపై ఉసిగొలుపుతుంటారు” అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో అన్నారు.

 

Related Posts

Latest News Updates