తెలంగాణ పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ నివాసంపై ఐటీ, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. కరీంనగర్ లోని మంకమ్మ తోటలో వున్న మంత్రి కమలాకర్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీర్ గ్రానైట్స్ లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే… సోదాల కోసం ఐటీ, ఈడీ వచ్చినప్పుడు మంత్రి గంగుల నివాసంలో లేరు. దీంతో ఐటీ, ఈడీ అధికారులు ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. గ్రానైట్ వ్యాపారంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతోనే ఈ సోదాలు జరుగుతున్నాయి.

 

 

మంత్రి కమలాకర్ తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. శ్వేతా ఎజెన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జేఎమ్ బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్ పోర్టు, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీ తదితర కంపెనీలపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని గతంలోనూ పలు గ్రానైట్ క్వారీ యజమానులకు ఈడీ నోటిస్తులిచ్చింది. 2012 లో జరిగిన స్కామ్ పై సీబీఐ గతంలోనూ నోటీస్ ఇచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదులతో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. 2011-2013 మధ్య కరీంనగర్ నుంచి కాకినాడు, క్రుష్ణపట్నం పోర్టుల నుంచి వేల కోట్లలో గ్రానైట్ ఎగుమతులు జరిగాయి.