తెలంగాణ ఇన్ ఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా వున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో ఏసీబీ డీజీగా వున్న అంజనీ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ ఛార్జీ డీజీపీ బాధ్యతలు అప్పజెప్పింది.  1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ ఇప్పటిదాకా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరక్టర్ జనరల్‌గా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అడిషనల్ డీజీపీగా కూడా వ్యవహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో కొన్ని వారాల పాటు మెడికల్ లీవ్ పెట్టినప్పుడు అంజనీ కుమార్‌ ఇంఛార్జ్ డీజీపీగా పనిచేశారు కూడా.

అలాగే మరికొంత మంది సీనియర్ ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ రవి గుప్తాను ఎంపిక చేసింది.  ఇక… అడిషనల్ డీజీపీగా వున్న 1992 బ్యాచ్ కి చెందిన జితేంద్రను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమిచింది. జితేందర్ గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీగా పని చేశారు. ఇప్పటివరకూ శాంతి భద్రతల అడిషనల్ డీజీగా పని చేశారు.

ఇక.. రాచకొండ సీపీగా సుదీర్ఘ కాలం పనిచేసిన మహేశ్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీపీగా నియమించింది. సిటీ అడిషనల్ సీపీగా వున్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ను రాచకొండ సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీ అండ్ ఎల్ అడిషనల్ డీజీపీగా సేవలందిస్తున్న 1997 బ్యాచ్కు చెందిన సంజయ్ కుమార్ జైన్ను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.