పాక్ స్థాయిని కూడా దిగజార్చే మాటలవి… భుట్టోకి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ దిగజారి మాట్లాడుతోందని, ఈ మాటలు పాక్ స్థాయిని కూడా దిగజార్చేశాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కౌంటర్ ఇచ్చారు. పాక్ మంత్రి మాటలు అనాగరికమని దుయ్యబట్టారు. 1971 లో ఏం జరిగిందో బిలావల్ భుట్లో మర్చిపోయినట్లున్నారని పాక్ ను దెప్పిపొడిచారు. ముంబై, న్యూయార్క్, లండన్, పఠాన్ కోట్, పుల్వామా దాడులు.. ఇవన్నీ పాక్ కేంద్రంగానే జరిగాయన్నారు. ఇక… కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖీ, అనురాగ్ ఠాకూర్ కూడా పాక్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘విఫల దేశానికి బిలావల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన విఫలమయ్యారు. పాక్‌ కూడా విఫలమైంది. ఉగ్రవాద మనస్తత్వంతో ఉన్న వారి నుంచి ఇంత కంటే ఏం ఆశించగలం’’ అని లేఖి అన్నారు. 1971 లో ఓడిన పాక్. తర్వాత ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని, ఇప్పుడు ప్రపంచం పాక్ నిజ స్వరూపాన్ని చూస్తోందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

 

ఐరాస వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపడంతో పాక్ కు ఏం చేయాలో పాలుపోక… ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని మోదీని కసాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాది బిన్ లాడెన్ చనిపోయాడు కానీ… గుజరాత్ లోని కసాయి బ్రతికున్నాడని, అతను భారత ప్రధాని అంటూ అనాగరిక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆరెస్సెస్ కే ప్రధాని అంటూ విమర్శించారు. నరేంద్ర మోదీకి అమెరికా అప్పట్లో వీసా నిరాకరించిందని, ప్రధాని అయిన తర్వాతే వీసా ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.

Related Posts

Latest News Updates