తెలంగాణలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ (ఐఐఎల్) ముందుకొచ్చింది. జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ కంపెనీ అందుబాటులోకి వ‌స్తే 750 మందికి ఉపాధి ల‌భించ‌నుంది. ప్ర‌జారోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం విష‌యంలో కూడా ప్ర‌పంచ ఆరోగ్య రంగానికి హైద‌రాబాద్ స‌హ‌కారం అందిస్తుంద‌న్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు సంతోషిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.