కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోతోపాటు లక్ష్మీ దేవి, గణపతి ఫొటోలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవతల చిత్రాలను వుంచడం వల్ల దేశం అభివృద్ధి
మార్గంలో ప్రయాణిస్తుందన్నారు. దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేస్తున్న సమయంలో తనకు ఈ ఆలోచన తట్టిందన్నారు. లక్ష్మీ దేవి సిరిసంపదలకు ఆళవాలమని, ఇక గణపతి విఘ్నాలను దూరం చేస్తారని వివరించారు. అందుకే నోట్లపై వారిద్దరి చిత్రాలను ముద్రించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సర్దుకుంటుందని అన్నారు.
మొత్తం కరెన్సీ నోట్లను మార్చాలని తాను కోరడం లేదని, ప్రతి రోజూ వీటిని ముద్రిస్తారు కాబట్టి, కొత్తగా ముద్రించే నోట్లపై హిందూ దేవుళ్ళ చిత్రాలను ముద్రించాలని కోరుతున్నానని, ఈ ఇద్దరు దేవుళ్లు సిరిసంపదలకు సంబంధించినవారని వివరించారు. మనం ప్రయత్నాలు చేసినప్పటికీ, దేవుళ్లు, దేవతలు మనల్ని ఆశీర్వదించకపోతే మన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వవు. మన కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీ దేవి ఫొటోలను ముద్రించాలని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని కేజ్రీవాల్ చెప్పారు. ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశమని, అక్కడ కేవలం రెండు, మూడు శాతం మాత్రమే హిందువులు ఉన్నారని చెప్పారు. ఆ దేశంలో కరెన్సీ నోట్లపై విఘ్నేశ్వరుడి ఫొటో ఉంటుందని తెలిపారు. ఇండోనేషియా ఆ పని చేసినపుడు, మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.












