హైదరాబాద్ వేదికగా భారీ ఉగ్ర పేలుళ్లు జరపాలన్న ఉగ్రవాదుల కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ లో పేలుళ్లను నిర్వహించి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనుకున్న వారిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. పాత నేరస్థుడు జాహెద్ తో పాటు మాస్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ అనే ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ జాహెద్ కు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో ఉగ్రదాడులు చేసేందుకు పాక్ నుంచే అతడికి నిధులు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ అందాయని వెల్లడించారు. నగరంలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని జాహెద్ అండ్ టీం ప్లాన్ చేసిందని పోలీసులు చెప్పారు. మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లతో కలిసి అబ్దుల్ జాహెద్ గ్రెనేడ్ దాడులకు సంబంధించిన ప్లానింగ్స్ చేశాడని వివరించారు. అబ్దుల్ జాహెద్ తో పాటు ఏడుగురి పై సిట్ కేసు నమోదు చేసింది.