‘హంట్’ టైటిల్ మాదే! న్యాయం చేయండి! అంటోన్న యంగ్ హీరో నిక్షిత్

సుధీర్ బాబు హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘హంట్’. ఇప్పుడు ఇదే టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. అయితే, ఈ టైటిల్ తమదేనని ఈ ‘హంట్’ సినిమా దర్శక హీరో అంటున్నారు. ‘హంట్’ టైటిల్‌ను తామే ముందుగా రిజిస్టర్ చేశామని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం జరగడంలేదని.. మీరే న్యాయం చేయండంటూ మీడియా ముందుకు వచ్చారు. అంతేకాదు, తమ సినిమా టీజర్‌ను సైతం సోమవారం విడుదల చేశారు. ఏదో ఒక్క జోనర్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు హీరో సుధీర్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావమరిదిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఘట్టమనేని ఇమేజ్‌ను వాడుకోకుండా తన అభిరుచి మేరకు సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ ప్రయోగాలు చేస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘HUNT’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు, పాపతో పైలం అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమా టైటిల్‌పై ఇప్పుడు వివాదం తలెత్తింది. ‘హంట్’ సినిమా తనదేనంటూ యంగ్ హీరో, దర్శకుడు నిక్షిత్ మీడియాకెక్కారు. తానే ముందుగా ఫిలిం చాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశానని చెబుతున్నారు. తన టైటిల్‌ను హుందాగా దొంగిలించారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిక్షిత్ హీరోగా, దర్శకుడిగా శ్రీ క్రియేషన్స్ పతాకంపై, ఎంఎస్ ఆర్ట్స్ సహ నిర్మానంలో నిర్మాత నర్సింగ్‌రావు రూపొందిస్తోన్న చిత్రం ‘హంట్’. ‘హోమిసైడ్ అన్‌లాఫుల్ యాక్ట్ నేషనల్ టీమ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టీజర్‌ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. ఆ తరవాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్‌ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ, హీరో-దర్శకుడు నిక్షిత్, డాన్స్ మాస్టర్ బషీర్, నిర్మాత నర్సింగ్ రావు పాల్గొన్నారు.ఎమ్‌ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మేము హంట్ అనే టైటిల్‌ను ఆరు నెలల క్రితం ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇప్పుడు అదే టైటిల్‌తో భవ్య క్రియేషన్స్ వాళ్లు సుధీర్ బాబు హీరోగా సినిమా చేస్తున్నారు. వాళ్లు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే, ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ అయింది. మేం రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను మీరెలా పెడతారు అని భవ్య క్రియేషన్స్ వాళ్లను అడిగాం. ఫిలిం చాంబర్‌లో కూడా మా సమస్యని తెలిపాం. చాంబర్ వాళ్లు కూడా భవ్య క్రియేషన్స్‌తో మాట్లాడారు. కానీ, మా సమస్యకు పరిష్కారం లభించలేదు. అందుకే ఈ ప్రెస్ మీట్. ఒక టైటిల్ రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు 21 రోజుల వ్యవధిలో వేరే చిత్రానికి అదే టైటిల్ రిజిస్టర్ అయిందా అని చెక్ చేసి మరీ టైటిల్‌ని రిజిస్టర్ చేస్తారు. మరి మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు ఎలా ‘హంట్’ టైటిల్‌ని వాడతారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు న్యాయం కావాలి’’ అని అన్నారు. హీరో, డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమా టైటిల్‌ని రాయల్‌గా దొంగిలించారు. రెండు మూడు నెలల నుంచి భవ్య క్రియేషన్స్ వాళ్లని రిక్వెస్ట్ చేస్తున్నాను. హంట్ టైటిల్ మేము రిజిస్టర్ చేసుకున్నాం.. మీరు టైటిల్ మార్చుకోండి అని అడిగాను. వాళ్లు పట్టించుకోవడం లేదు. చాంబర్‌లో కూడా ఫిర్యాదు చేసాం. కానీ, మాకు న్యాయం దొరకలేదు. మీడియా వల్లే నాకు న్యాయం జరగాలి’’ అని వాపోయారు.నిర్మాత నర్సింగ్ రావు మాట్లాడుతూ.. ‘‘మేము మా శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై హంట్ టైటిల్‌ను రిజిస్టర్ చేసాం. షూటింగ్ కూడా జరుపుకుంటున్నాం. అకస్మాత్తుగా ఒకరోజు హంట్ టైటిల్‌తో సుధీర్ బాబు గారి పోస్టర్ కనిపించింది. వెంటనే భవ్య క్రియేషన్స్ వాళ్లని కాంటాక్ట్ అయ్యాను. కానీ వాళ్లు సరిగ్గా స్పందించలేదు. చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నం చేసాను కానీ ఫలితం లేదు. చాంబర్ వాళ్లు కూడా ప్రయత్నం చేసారు కానీ ఫలితం లేదు. మా సినిమా ఆడియో రైట్స్ అమ్మడానికి ప్రయత్నం చేసాం. కానీ, హంట్ పేరుతో వేరే చిత్రం ఉంది మేము మీ సినిమాను కొనలేం అని అన్నారు. మాకు న్యాయం కావాలి’’ అని తెలిపారు. మరి, ఈ వివాదంపై భవ్య క్రియేషన్స్ కానీ, హీరో సుధీర్ బాబు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Posts

Latest News Updates