కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమానం అత్యవసరంగా అసోంలో ల్యాండ్ అయ్యింది. అగర్తలా పర్యటనకు వెళ్తుండగా… వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించక పోవడంతో గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేశారు. అగర్తలాలో దట్టమైన పొగమంచు వుందని… అందుకే అక్కడ విమానం ల్యాండ్ కాలేదని అధికారులు వివరణ ఇచ్చారు.
షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అగర్తలాలోని ఎంబీబీ విమానాశ్రయంలో రాత్రి 10 గంటలకు దిగాల్సి వుంది. పొగమంచు కారణంగా…. ఏమీ కనిపించలేదని, అందుకే గౌహతిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ఎస్పీ శంకర్ దేవనాథ్ వెల్లడించారు. త్రిపురలోని ధర్మనగర్, సబ్రూమ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జరగనున్న పార్టీ రథయాత్రలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కారణంగానే అమిత్ షా అగర్తలా టూర్ పెట్టుకున్నారు.