ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీ భాషలో రూపొందించిన బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో హిందీ మెడికల్ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ మెడికల్ కళాశాల్లోని మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనున్నటు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడు ఈరోజు స్వర్ణాక్షరాలతో ముద్రితమవుతుందని స్పష్టం చేశారు.
ఇది దేశ విద్యా రంగానికి పునరుజ్జీవనం, పునర్నిర్మాణ దినం అని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాథమిక , సాంకేతిక, వైద్య విద్య లో విద్యార్థుల మాతృభాషకు ప్రాధాన్యతను కల్పించడం ద్వారా కొత్త విద్యా విధానంలో ఎంతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా కొనియాడారు.
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, గుజరాతీ, బెంగాలి మొదలైన ప్రాంతీయ భాషలలో వైద్య , ఇంజినీరింగ్ విద్య ను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం లోని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మొట్ట మొదటగా స్పందించిందని ఆ యన అభినందించారు. మాతృభాషలో ఆలోచనా ప్రక్రియ అత్యుత్తమంగా జరుగుతుందని, మాతృభాషలో మాట్లాడే పదాలు హృదయాన్ని తాకుతాయని విద్యార్థులకు చెప్పారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించిన ప్రధాని మోదీ
ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీ భాషలో రూపొందించిన బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. హిందీలో ఎంబీబీఎస్ ను బోధించడం కీలక పరిణామమని, ఇందుకోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇది దేశంలో పెద్ద మార్పును తీసుకువస్తుందని చెప్పారు. లక్షల మంది విద్యార్థులు తమ సొంత భాషలో చదువుకుంటారని అన్నారు. వారికి చాలా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మోదీ ట్వీట్ చేశారు.