మార్చి 22, 2025న ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఎడిషన్ ఘనంగా జరిగింది. “వన్ నేషన్, వన్ అవార్డు” అనే థీమ్ తో ఓ టి టి లో అత్యుత్తమ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ, ప్రీమియర్ పాన్ ఇండియా ఓ టి టి ఈవెంట్ గా పేరు తెచ్చుకుంది. అపరశక్తి ఖురానా మరియు కుబ్రా సైత్ వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్ లో, దేశంలోని విభిన్న చలనచిత్ర పరిశ్రమల నుండి ప్రతిభావంతులు పాలుపంచుకున్నారు. ఓ తో టి స్పేస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను తన ప్రఖ్యాత అవార్డులతో సత్కరించింది.
‘డిస్పాచ్’ కోసం ఉత్తమ నటుడు గా మనోజ్ బాజ్‌పాయ్, ‘భామ కలాపం 2’ కోసం ఉత్తమ నటిగా ప్రియ మణి మరియు ‘ది రాణా దగ్గుబాటి షో’ కోసం ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ బాజ్‌పేయి మరియు ప్రియమణి నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ గురించి కూడా విషయాలు పంచుకున్నారు.

ఉత్తమ దర్శకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మద్దలి హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే 2025 అవార్డు ను అందుకోవటం విశేషం. జీ 5 లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి కి గాను ప్రదీప్ ఈ అవార్డు ను అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ అట్ నైట్) తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. జీ5 మరియు ఓ టి టి ప్లే ప్రీమియంలో ప్రసారం అవుతున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ తెలుగు సిరీస్ విక్కటకవి కి ప్రదీప్ మద్దాలి కి ఈ అవార్డు లభించింది.
1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో జరిగిన ‘విక్కటకవి’, జ్ఞాపకాలను చెరిపేసే ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే కథ తో ఆద్యంతం ఉత్కంఠ రేపే కథనం తో ఒక గ్రామీణ థ్రిల్లర్ గా ప్రదీప్ రూపొందించిన తీరు వీక్షకుల కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణ గా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు.

వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుండి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ’47 డేస్’ మరియు ఆధ్యాత్మిక సిరీస్ ‘సర్వం శక్తి మయం’ తో టాలెంటెడ్ దర్శకుడిగా ఓ టి టి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, ‘విక్కటకవి’ తో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. ఈ విజయం ప్రశంసలతో పాటూ ప్రతిష్టాత్మక హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డును సంపాదించిపెట్టింది.
షోయబ్ సినిమాటోగ్రఫీ,. రామోజీ ఫిల్మ్ సిటీ మరియు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుని క్వాలిటీ గ్రాఫిక్స్ తో చిత్రీకరించబడిన ‘విక్కటకవి’ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ గా ప్రశంసలు అందుకుంది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించబడిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ విక్కటకవి కావడం ఈ సిరీస్ సాధించిన విజయాన్ని సూచిస్తుంది.

అవార్డు అందుకున్న సందర్భంగా ప్రదీప్ మద్దాలి హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డ్స్ కు, అతని తల్లిదండ్రులు మరియు అతని బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు.
ఓ టి టి ప్లే సహ వ్యవస్థాపకుడు మరియు CEO అవినాష్ ముదలియార్ మాట్లాడుతూ, అవార్డులు అన్ని భారతీయ భాషలలో సినిమాలు మరియు సిరీస్‌లను పరిశీలించి ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ప్రదీప్ మద్దాలి వంటి దర్శకులు సృజనాత్మక సరిహద్దులను ముందుకు తీసుకెళ్లడంతో, రీజినల్ ఓ టి టి కంటెంట్ కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది అన్నారు. విక్కటకవి మరియు ప్రదీప్ మద్దాలి విజయం ప్రాంతీయ ఓ టి టి కంటెంట్ లో మైలురాయి గా నిలుస్తుంది. వికటకవి రెండవ సీజన్ కోసం అంచనాలు మరింత పెరిగాయి.
