సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని హలో మీరా అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ఈ మేరకు ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ హలో మీరా టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన హరీష్ శంకర్.. ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక వైవిధ్యభరితంగా ఉండనుందని ఈ టీజర్ ద్వారా తెలిసిపోతోందని చెప్పారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ హలో మీరా టీజర్ లో సినిమా సోల్ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. మీరా అనే సింగిల్ క్యారెక్టర్, ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్ అందులోని ట్విస్టులు ఈ మూవీ కథపై ఇంట్రెస్ట్ నెలకొల్పాయి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఇంతలో అమ్మానాన్న, ఫ్రెండ్స్, లవర్, పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం.. దాంతో మీరా పరిస్థితి ఏమైంది అనే కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ గా ఈ మూవీ ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది.హలో మీరా అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిస్తున్నారు. చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు.
