కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడొచ్చని తెలిపింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా వుంటుందని, రానున్న 3 రోజుల్లో మత్స్యకారులు చేపట వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపుకు పయనించే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక.. నిన్న ఏపీలో హుకుంపేట, కపిలేశ్వరపురం, ఏలూరులోని చాట్రాయి. ఆళ్లగడ్డ, జగ్గంపేటలో వర్షం పడింది.
ఇక దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన సౌత్ 24 పరగణాస్, పుర్బా, పశ్చిమ మేదీనీపూర్, కోల్ కతా ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.