అనంతపురంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లోని వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఇంత వరద నీరు రావడంతో గ్రామాలు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద నీరు విపరీతంగా రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. ఇప్పటికీ పలు కాలనీల్లో నీరు అలాగే ప్రవహిస్తోంది. అనంతపురంలోని రుద్రంపేట నుంచి నగరంలోకి వచ్చే చోట నడిమివంక దగ్గర భారీగా నీరు ప్రవహిస్తోంది. దీంతో రుద్రంపేట, అనంతపురం నగరానికి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరద నీటిలో చిక్కుకున్న 30 మంది హాస్టల్ విద్యార్థులను పోలీసులు రక్షించారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా వరద నీరు రావడంతో కొట్టాలలోని ఓ పాఠశాల విద్యార్థులు వరద నీటిలో చిక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని రక్షించారు.రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రుద్రంపేట, విశ్వశాంతినగర్, చంద్రబాబు కొట్టాల గౌరవ్ రెసిడెన్సీ కాలనీలు నీటమునిగాయి. మరోవైపు రుద్రంపేట ఆలమూరు రహదారిలో భారీగా చేరిన వరద నీటి ప్రాంతాలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు.