రాజధాని హైదరాబాద్ లో నిన్న రాత్రి మళ్లీ వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, మైత్రీవనం, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో విపరీతమైన వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. వర్షం వల్ల నీరు ఇళ్లల్లోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.బాలానగర్ లో అత్యధికంగా 10.4 సెంటీ మీటర్ల వాన పడింది. అల్వాల్ మచ్చ బొల్లారంలో 9.6, తిరుమగిరిలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెస్ట్ మారేడుపల్లిలో 9.3, కుత్బుల్లా పూర్ లో 9.2, ఆర్సీపురంలో 9.1 సెంటీ మీటర్ల వాన పడింది.
రాత్రి పడిన వర్షం వల్ల మేడ్చల్ మార్గంలో రోడ్డు కోతపడింది. కొంపల్లి నుంచి దూలపల్లి వైపు వెళ్లు దారిలో రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు పోలీసులు.