జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం దీనిని అత్యంత సీరియస్ గా తీసుకుంది. హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైందని క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజీని డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. టిక్కెట్ల అమ్మకం బాధ్యత హెచ్‌సీఏదేనని స్పష్టం చేశారు. మరోవైపు తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో హెచ్‌సీఏ అధికారులందరూ వెంటనే తమ కార్యాలయానికి వచ్చి తమను కలవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు హాజరుద్దీన్ మంత్రిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో క్రీడల శాఖ కార్యదర్శితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత హెచ్‌సీఏ అధ్యక్షుడు హాజరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు. టిక్కెట్ల కోసం తొక్కిసలాట జరగడం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. అయితే.. ఇందులో తమ తప్పేమీ లేదన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సూచనలను పాటిస్తామన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తుండడంతో టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారని అన్నారు. జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారికి HCA పూర్తిగా వైద్య ఖర్చులను భరిస్తుందని స్పష్టం చేశారు.