తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న చికిత్స చూసి తమిళనాడు లో సీఎం స్టాలిన్‌ కూడా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందున్న మూడు డయాలసిస్ కేంద్రాలను 102 కు పెంచామని స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఒక దేవుడు ఇచ్చిన వరం లాంటివని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఒకే సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ ,సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ దేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్ లోఎయిమ్స్ ఆస్పత్రి ఇస్తామంటే ఐదు కోట్ల విలువైన భూమి ఇచ్చామని, అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.