కాళేశ్వరం పంపు హౌజ్ మరమ్మతులను ఏజెన్సీ ద్వారానే చేయిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాళేశ్వరం నిర్మాణం వల్ల డబ్బులు వృథా కాలేదని, ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల పంట పండిందని ప్రకటించారు. గత మూడేళ్లలో లక్ష కోట్లు విలువ చేసే పంట పండిందన్నారు. కాళేశ్వరం నిర్మాణం వల్ల డబ్బులు ఆదా అయ్యాయని అన్నారు. శాసన మండలి వేదికగా హరీశ్ రావు నేడు కీలక ప్రసంగం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవాలని కొందరు కోరుకుంటున్నరని .. అలా కోరుకున్న వాళ్లే కాళేశ్వరం పంపు హౌస్ లు మునిగితే ఆనందం పొందారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు లక్ష కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు చలువ వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరిగిందన్నారు. వరదలను ప్రభుత్వ తప్పిదంలా చూపించే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. కాళేశ్వరం పూర్తి కావొద్దని కొందరు కోరుకున్నారన్నారు. డీపీఆర్ లేదని కేంద్ర మంత్రులు విమర్శలు చేశారని, డీపీఆర్ లేదన్న వారే కాళేశ్వరానికి 10 అనుమతులు ఇచ్చారన్నారు. డీపీఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కాళేశ్వరానికి అనుమతులు వచ్చాయని ప్రకటించారు. కాళేశ్వరంలో తాము ఏదో వైఫల్యం చెందామని చూపించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. మేడిగడ్డ పంప్ హౌజ్ కు వచ్చే నెలలో నీరిస్తామని, కాళేశ్వరం వచ్చాక ఏడాది రెండు పంటలు పండుతున్నాయని హరీశ్ తెలిపారు.