ఖమ్మం సభ వేదికగా జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దశ దిశ చూపిస్తారని మంత్రి, సభ ఇంఛార్జీ హరీశ్ రావు ప్రకటించారు. దేశం చూపు ఖమ్మం వైపు ఉందని, ఈ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుందని ఆయన అన్నారు.. భాజాపాకు తెలంగాణలో స్థానం లేదని, గత ఎన్నికల్లో భాజాపా ఒక్క సీటే గెలిచిందని మంత్రి తెలిపారు. దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖించేందుకు కేసీఆర్ మొదలుపెట్టిన బీఆర్ ఎస్ పార్టీకి జాతీయ నేతలు మద్దతిస్తున్నారని, ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా విపక్షాల ఐక్యత చాటనున్నారని ప్రకటించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభకు హాజరుకానున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ నేత రాజా ఖమ్మం సభలో పాల్గొంటారని హరీశ్ ప్రకటించారు.
భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు, వీవీఐపీలతో పాటు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. అందుకని 4 వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలకు స్పెషల్ పాస్‌లు అందించనున్నారు. సభ జరిగే ప్లేస్‌కు 500 మీటర్ల లోపు దాదాపు 480 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేయనున్నారు. పోలీసులకు సహాయంగా వాలంటీర్ల నియమించారు. ప్రజలకు మజ్జిగ, మంచినీళ్లు అందించున్నారు.