తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ లా కాదని, రాజ్ భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే వుంటాయని అన్నారు. కొంత మంది ప్రొటోకాల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, తన పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే అధికారులకు పంపిస్తానని అన్నారు. గతంలో తన పర్యటనల్లో ప్రోటోకాల్ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై బుధవారం రాజ్ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించేవారే అయితే… గవర్నర్ కు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజ్ భవన్ గౌరవాన్ని దిగజార్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య వున్నా రాజ్ భవన్ వెళ్లి నిరసన తెలపాలని చెబుతున్నారని, రాజ్ భవన్ ఎప్పటికీ అందుబాటులో వుంటుందన్నారు.

 

 

పెండింగ్ వున్న బిల్లులపై సందేహాలున్నాయని, వాటిపై క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం వుందని గవర్నర్ అన్నారు. ప్రభుత్వం నుంచి తన వద్దకు బిల్లులు వచ్చాయని, వాటి విషయమై పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నానని, ఆ బాధ్యత తనపై వుందన్నారు. తాను ఎలాంటి బిల్లులను ఆపలేదని, బిల్లులను తొక్కిపెట్టాననడం సరికాదన్నారు. బోధనా పోస్టులను భర్తీ చేయాలని తాను మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నానని అన్నారు. వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. నేను పదే పదే డిమాండ్‌ చేశాక వీసీలను నియమించారు అని గుర్తు చేశారు.