సింగపూర్లో అమర గాయకునికి అపూర్వ నివాళి – ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి, “శ్రీ సాంస్కృతిక కళాసారథి” వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, నిర్వాహకబృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రకాశనం గావించి ఘంటసాల మాస్టారు చిత్రపటానికి పూవులతో నివాళులు అర్పించారు.

“గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న ‘ఘంటసాల స్వరరాగ మహాయాగం’ కార్యక్రమం యొక్క సమాపనోత్సవంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనికై భారతదేశం నుండి అతిథులు గాయనీగాయకులు మరియు వాద్య బృందం సింగపూర్ కు విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం మా సంస్థ ద్వారా జరగడం మా అదృష్టంగా భావిస్తున్నామని” రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి సందేశాన్ని పంపిన వామరాజు సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.

కిషన్ రెడ్డి తమ‌ అభినందన వీడియో సందేశంలో “ఈ కార్యక్రమం సింగపూర్ లో నిర్వహించడం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు.”ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమార్తె సుగుణ ఈ కార్యక్రమానికి అభినందన సందేశాలు పంపుతూ “పైనుండి ఘంటసాల వారు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారన్నారు.”

శుభోదయం సమర్పణలో, మాధవపెద్ది సురేష్ సారధ్యంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో, ప్రముఖ నేపథ్య గాయనీగాయకులు చంద్రతేజ, సురేఖ మూర్తి, చింతలపాటి సురేష్ అద్భుతమైన పాటలను ఆలపించగా, ప్రముఖ వాద్య కళాకారులు సాయి కుమార్ పవన్ కుమార్ సోదరులు, యుగంధర్, చక్రపాణి సోమేశ్వరరావు చక్కటి వాద్య సహకారాన్ని అందించారు.దుబాయ్ నుండి విచ్చేసిన నాట్య కళాకారిణి కుమారి తెన్నేటి శ్రావణి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకర్షించింది.

 

ఈ వేదికపై శుభోదయం వారి “షడ్రుచి” శాఖ ప్రకటనను సింగపూర్ లో విడుదల చేశారు. వారు నిర్మించిన ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ దర్శకులు రామారావు నిర్మాత జి వి భాస్కర్ లను శ్రీ సాంస్కృతిక కళాసారథి వారు ప్రత్యేకంగా సత్కరించారు. వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా పీఎస్ గోపాలకృష్ణ రచించిన ‘మన ఘంటసాల’ అనే పుస్తకాన్ని ఈ వేదికపై అతిధులు అందరూ కలిసి ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంగా కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లన్నీ గావించిన శుభోదయం బాలసుబ్రమణ్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి అందమైన పాటలను పాడి ఘంటసాలవారికి జోహార్లు అర్పించగా, ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్త అయిన రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించారు. సింగపూర్లో పంగోల్ లోని జిఐఐయస్ ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్ లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు.

Related Posts

Latest News Updates