అధికార డీఎంకే, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదం రగులుతూనే వుంది. అయితే… శాసన సభా వేదికగా ఈ వివాదం మరింత రాజుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగంలో ద్రావిడ మోడల్ సర్కార్, తమిళనాడు ప్రభుత్వం, అంబేద్కర్, పెరియార్, కామరాజార్ ,అన్నాదురై లాంటి పదాలను వదిలేశారు. ఈ పదాలను వదిలేసి, గవర్నర్ ప్రసంగం చదవడంతో డీఎంకే కూటమి సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, వల్లూవర్ కొట్టాం, అన్నా సాలాయి ప్రాంతాల్లో ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్ లో పేర్కొన్నారు. గెట్ అవుట్ రవి అనే హ్యాష్ ట్యాగ్ తో గవర్నర్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. దీంతో హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఇక… గవర్నర్ వ్యవహారంపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు అన్న పదాన్ని గవర్నర్ పలకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా ఇక్కడి ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డు చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని అభ్యంతర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఆమోదించింది.