రాహుల్ వ్యవహారాన్ని జర్మనీ గమనిస్తోందట…

రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంపై పాశ్చాత్య దేశాలు స్పందించడం విడ్డూరంగా కనిపిస్తోంది. మొన్నటి మొన్న అమెరికా కూడా స్పందించింది. తాజాగా జర్మనీ స్పందించడం ఆశ్చర్యం. రాహుల్ కేసును తాము గమనిస్తున్నామని జర్మనీ విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది. రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం రద్దు కావడం లాంటి అంశాలను గమనిస్తున్నామని పేర్కొంది. అయితే… జర్మనీకి కాంగ్రెస్ దిగ్విజయ్ ధన్యవాదాలు ప్రకటించారు.  దిగ్విజయ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, రాహుల్ గాంధీని పీడించడం ద్వారా భారత దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతింటోందో గుర్తించినందుకు జర్మన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, రిచర్డ్ వాకర్‌కు ధన్యవాదాలు చెప్పారు.

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ సెక్రెటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు ఉపక్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఎప్పటి లాగే అమేథీ నుంచి బరిలో వున్నా… రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో నిలిచారు.అయితే అమేధీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపొందగా… రాహుల్ ఓడిపోయారు. అయితే… రెండో స్థానమైన వయనాడ్ నుంచి గెలుపొందారు.

 

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ కర్నాటకలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ఇంటిపేరున్న వారందరూ దొంగలే అంటూ విమర్శలు చేశారు .దీంతో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్ కోర్టు గురువారం వాదనలు విని, రాహుల్ కి 2 సంవత్సరాల పాటు జైలుశిక్ష విధించింది. అయితే సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ సచివాలయం రాహుల్ పై అనర్హత వేటు వేసింది.

 

Related Posts

Latest News Updates