కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు రాజస్థాన్ సీఎ అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత గెహ్లాట్ ఈ ప్రకటన చేశారు. అయితే.. అంతిమ నిర్ణయం మాత్రం పార్టీదేనని, తన డిమాండ్లేవీ వుండవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పోటీలో వుండడం లేదని, అయితే.. సీఎంగానే వుండిపోతారా? అని ప్రశ్నించగా… అది సోనియా గాంధీ నిర్ణయిస్తారని అన్నారు. నేడు సోనియా గాంధీతో పూర్తిగా మాట్లాడాను. జరిగిన పరిణామాలపై షాక్ కు గురయ్యాను. సీఎంగా తానుండడానికే అవన్నీ పరిణామాలు జరిగాయని తెలియజేశాను అని గెహ్లాట్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీలో దిగ్విజయ్ సింగ్, థరూర్ వుంటారని, వారిద్దరి మధ్యే పోటీ వుంటుందని పేర్కొన్నారు.
మరోవైపు తాను కొచ్చిలో రాహుల్ గాంధీని కలుసుకున్నానని, అధ్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగమని అభ్యర్థించానని గెహ్లాట్ వెల్లడించారు. అయితే.. రాహుల్ అంగీకరించలేదని, అందుకే తాను బరిలోకి దిగుతానని ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. కానీ.. రాజస్థాన్ వేదికగా జరిగిన పరిణామాల నేపథ్యంలో పోటీ చేయకూడదని నిర్ణయించానని అన్నారు.