హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో  జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో  జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డిజిటల్ ఎకానమీ రంగంలో ఇండియా సాధించిన విజయాలపై సదస్సులో ప్రస్తావించనున్నారు ఇండియా ప్రతినిధులు. అలాగే 2030 నాటికి ఇండియా లక్ష్యాలను ఇతర దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. గ్లోబల్  పార్ట్‌నర్‌ షిప్‌ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జరుగుతోన్న ఈ సదస్సులో జీ 20 దేశాల ప్రతినిధులతోపాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.  జీ20 యేతర దేశాల భాగస్వామ్యం, జీ20తోపాటు ఇతర దేశాల్లో డిజిటల్‌ చెల్లింపులు తదితర అంశాల గురించి చర్చిస్తున్నట్టు జీ20 ఇండియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌ ష్రింగ్లా చెప్పారు. ‘గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌ (జీపీఎఫ్‌ఐ)’ ప్రధాన సమావేశాలు సోమ, మంగళవారాల్లో జరుగనున్నాయి.